బాహుబలి పరువు తీస్తారా?    2018-05-06   23:59:35  IST 

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా ‘బాహుబలి’ చిత్రంతో విస్తరింపజేసిన విషయం తెల్సిందే. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి రెండవ పార్ట్‌ అద్బుతమైన కలెక్షన్స్‌తో బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల వారికి సైతం షాక్‌ ఇచ్చింది. బాలీవుడ్‌ స్టార్స్‌ సినిమాలను పక్కకు నెట్టి బాహుబలి సాధించిన కలెక్షన్స్‌ ఎప్పటికి మర్చిపోలేనివి. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలంగా జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రం నిలిచి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణలు ప్రధాన తారాగణంగా నటించిన ‘బాహుబలి’ చిత్రంకు ప్రీక్వెల్‌ను చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు సైతం వారు ముందుకు వస్తున్నారు. ప్రీక్వెల్‌కు ఆర్కామీడియా ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ను చేయిస్తుంది. అయితే ప్రీక్వెల్‌ ఒక సినిమా మాదిరిగా కాకుండా వెబ్‌ సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు బాహుబలి ప్రీక్వెల్‌లో అంతా కూడా కొత్త వారే నటించబోతున్నట్లుగా ఆర్కా మీడియా వారు వెళ్లడి చేశారు. ఒక అద్బుతానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేయాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు చెబుతున్నారు.