Baahubali is killing Bollywood – opines Bollywood critics

బాహుబలి సీరీస్ తెలుగు సినిమాకి ఎంత మేలు చేసిందో, ఇప్పుడు బాలివుడ్ కి అంత కీడు చేస్తోంది. అసలే గత రెండు సంవత్సరాల్లో బాలివుడ్ ట్రాక్ రికార్డు బాగాలేదు. ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ ఇద్దరి మీదే మొత్తం మార్కెట్ ఆధారపడి ఉంది. ఈ ఇద్దరు వస్తే తప్ప హిందీ బాక్సాఫీస్ సందడి చేయడం లేదు. ఇక మరో ఖాన్ త్రయంలో ఒకప్పటి నెం.1 షారుఖ్ ఖాన్ పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా మారుతోంది. అక్షయ్ కుమార్ హిట్ కొట్టినా, అదేమీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు. హృతిక్ కూడా ఎప్పుడో చల్లబడ్డాడు ఇక మిగితా హీరోల సంగతి ఎందుకు. ఇలా కష్టకాలంలో ఉన్న బాలివుడ్ ఇండస్ట్రీని, దాని మీద ఆధారపడి బ్రతుకున్న పంపిణిదారులు, ముఖ్యంగా సింగల్ స్క్రీన్ థియేటర్ యజమానులను ఆదుకుంది బాహుబలి. ఆ సినిమా ఎంతలా నచ్చింది అంటే, ఇన్నిరోజులు బాలివుడ్ చప్పటి కూడు తింటున్నవారికి ఒక రుచికరమైన మాంసాహారం దొరికినంత పనైంది. దాంతో ఒక డబ్బింగ్ సినిమా హిందీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 500 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి, దంగల్ కలెక్షన్లను హిందీలో 120 కోట్ల తేడాతో ఓడించింది.

ఆ తరువాత హిందీ మీడియం అనే ఒకే ఒక్క హిట్ సినిమాను మినహాయిస్తే బాలివుడ్ లో సక్సెస్ ఫుల్ సిన్మా లేదు. అసలు ఈ ఏడాది బాలివుడ్ లో వచ్చిన హిట్స్ ని ఒకే చేతిలోని వేళ్ళ మీద లెక్కపెడదామనన్నా కుదరట్లేదు. అంటే పట్టుమని అయిదు కూడా లేవు అన్నమాట.