Arjun Ranatunga alleges that 2011 WC final was fixed

2011 ప్రపంచకప్ ఇంకా మన జ్ఞాపకాల్లోంచి వెళ్ళలేదు. 28 సంవత్సరాల కళ ఆరోజు తీరింది. అయిదు ప్రపంచ కప్స్ ఆడిన తరువాత, ఎట్టకేలకు సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఉండిపోయిన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. దాయాదుల పోరులో భారత్ పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించి ఫైనల్ కి చేరింది. భారత్ తో పాటే ఫైనల్ కి చేరుకుంది మరో ఆసియా జట్టు. అదే శ్రీలంక. ఏప్రిల్ 2, 2011న మొదలైంది ఫైనల్. మొదట బ్యాటింగ్ చేసింది శ్రీలంక. ఆరంభంలోనే జహీర్ ఖాన్ ధాటికి ఓపెనర్ తరంగని పోగుట్టుకున్న లంకేయులు, జయవర్థనే సెంచరీతో, కుమార్ సంగక్కర సూపర్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 50 ఒవర్లలలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది శ్రీలంక.

పెద్ద టోటల్ ని చేజ్ చేస్తూ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ కి దారుణమైన ఆరంభం లభించింది. స్కోరు బోర్డు మీద 31 పరుగులు ఉండగానే సచిన్, సెహ్వాగ్ ఇద్దరు పెవిలియన్ చేరారు. పేస్ బౌలర్ మలింగ నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో భారత్ గెలుపు కష్టమే అనుకున్నారు. ప్రపంచకప్ కల ఈసారి కూడా తీరదు అనుకున్నారు. కాని ఎక్కడో ఆశ. గంభీర్ ఆడుకుంటాడు అని, కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న యువరాజ్ పోరాడుతాడని, యువ సంచలనం కోహ్లీ తన ప్రతిభ కనబరుస్తాడని. అనుకున్నట్టే గంభీర్ ఆదుకున్నాడు. కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి కష్టాల నుంచి టీమ్ ని బయటకి లాక్కొచ్చాడు. కాని గెలుపుని పూర్తీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మళ్ళీ అలజడి. యువరాజ్ మీదే వంద కోట్ల మంది ఆశ. కాని ఎవరు ఊహించని విధంగా ఫామ్ లో లేని ధోని తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ, జట్టుని విజయతీరాలకు చేర్చాడు. సిక్స్ తో మ్యాచ్ ముగించి ప్రపంచకప్ సాధించి పెట్టాడు.

ఆ జ్ఞాపకాలు మనల్ని ఇంకా మురిపిస్తున్నాయి. కాని అదంతా ఫిక్సింగ్ అంటున్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్, 90 దశకంలోని దిగ్గజ ఆటగాడు అర్జున్ రణతుంగా. “నేను ఫైనల్ సమయంలో ఇండియాలోనే ఉన్నాను. వ్యాఖ్యానం చేస్తున్నాను. మా జట్టు ఆట నన్ను బాధపెట్టింది. అలాగే నాకు ఓ అనుమానం వచ్చింది. 2011 ఫైనల్ లో ఏం జరిగిందో విచారణ చేయాలి. నేను ప్రతి విషయాన్ని బయటపెట్టలేను. కాని ఎదో ఒక రోజు బయటపెడతాను. దీని మీద ఇంక్వైరీ వేయాలి” అంటూ ఓ సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అర్జున్ రణతుంగా.

ఈ వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ” అర్జున్ రణతుంగ వేసిన ఆరోపణలను చూస్తోంటే నాకు ఆశ్చర్యమేస్తోంది. ఆయనలాంటి దిగ్గజం నోటి నుంచి రావాల్సిన మాటలు కావు ఇవి. ఒక మాట అనేముందు సాక్ష్యాలు చూపించాలి” అంటూ గంభీర్ స్పందించగా, ఇంకా గాటుగా మాట్లాడుతూ ఆశీష్ నెహ్రా “నేను 1996లో శ్రీలంక ఆయన సారథ్యంలో గెలిచిన ప్రపంచకప్ బూటకం, ఫిక్స్ అయ్యిందని అంటాను ? అది ఆయనకు బాధ కలిగించదా?” అన్నాడు.