టీడీపీ గెలుపు ధీమాను ఆ పథకాలే అడ్డుకోబోతున్నాయా ..?     2018-06-25   03:23:58  IST  Bhanu C

ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని .. అందుకే వారికోసం అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కాబట్టి ప్రజల్లో తెలుగుదేశం పై అభిమానం బాగా పెరిగిందని రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఇదే దోహదం చేస్తుందని చంద్రబాబు అండ్ కో బృందం ఆలోచన చేస్తోంది. ఈ పధకాల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ పధకాలు చాలా వరకు ప్రజల్లోకి వెళ్లడం లేదని… ఇదే టీడీపీ ఎన్నికల్లో టీడీపీ కొంప ముంచబోతోందని తెలుస్తోంది.

గ్రామాల్లో సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా టీడీపీ ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు అవినీతికి అడ్డాగా మారిపోయాయి. గ్రామాల్లో వీరి జోక్యం మితిమీరిపోయాయి. ప్రతిపనికీ ఒక రేటు కట్టడం.. తమకు నచ్చినవారికే వివిధ పధకాలు మంజూరు చేస్తూ మిగిలిన ప్రజల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. దీంతో ఆ కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇక సంక్షేమ పధకాలు కూడా ప్రజలకు చేరింది తక్కువే. ఎస్సీ సంక్షేమ పథకాలు బినామీల పాలవుతున్నాయి. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్ల కొనుగోలు పథకం ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఇవి ఎస్సీల పేరుతో పలువురు ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువుల వద్దకు చేరాయి. భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. రూ.200 కోట్లతో 4333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు 75శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు ప్రకటించింది. కానీ, నాలుగేళ్లలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయానికి వస్తే మొత్తం రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.800కోట్లు బకాయి ఉన్నారు.మైనార్టీలకు రూ.500 కోట్లకు మించి ఖర్చుపెట్టింది లేదు.