పగబట్టిన బాబు .. పొగ పెట్టాలని చూస్తున్నాడు     2018-07-04   00:11:21  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు ఏమి చేసినా ఆహా .. ఓహో .. అద్భుతం అంటూ మీడియాలో వస్తుంటాయి. నిరంతరం బాబు ని ఆకాశానికి ఎత్తేస్తూ కథనాలే మీడియాలో వండి వారుస్తుంటారు. దానికి ప్రధాన కారణం ఆ మీడియా అధినేతలంతా బాబు సామాజికవర్గం వారే. ఆ అభిమానంతోనే లేక ఇంకేదైనా ప్రతిఫలం ఆశించో తెలియదు కానీ ఎప్పుడూ టీడీపీ అనుకల కథనాలే తప్ప ప్రతికూల కథనాలు ప్రచారం కావు. ఇంతవరకు బాబుగానే మేనేజ్ చేసుకుంటూ వస్తున్న బాబు కి ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.

చంద్రబాబు గొప్పను మాత్రమే ప్రధాన మీడియా ప్రచారం చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు పాలనలోని అసలు లోపాలు, అవినీతి, అక్రమాలు, వైఫల్యాలు మాత్రం జనాల్లోకి చాలా బలంగా వెళ్లిపోతున్నాయి. లోకేష్ ప్రసంగాల నుంచి.. చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యల వరకు.. జనంలోకి క్షణాల్లో చేరిపోతున్నాయి. ఆఖరికి లోకేష్ అంటే సోషల్ మీడియాలో ఒక కమెడియన్ . అందరికి వినోదం పంచే ఒక స్టార్ . ఆ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆయన్ను వాడేసుకుంటున్నారు.

సోషల్ మీడియా దెబ్బ ఏంటో బాబుకి తెలియంది కాదు. అంతెందుకు 2014కు ముందు సోషల్‌ మీడియాలో టీడీపీ చేసిన ప్రచారం.. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు చేసిన పన్నాగాలు అన్నిఇన్నీ కాదు. అవన్నీ ఫలించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా టీడీపీని అధికారానికి దూరం చేసేలా కనిపిస్తోంది.