Andhhagadu Movie Review

చిత్రం : అంధగాడు

బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్

దర్శకత్వం : వెలిగొండ శ్రీనివాస్

నిర్మాత : రామబ్రహ్మం సుంకర

సంగీతం : శేఖర్ చంద్ర

విడుదల తేది : జూన్ 1, 2017

నటీనటులు – రాజ్ తరుణ్, హెబ్బాపటేల్, రాజేంద్రప్రసాద్

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (అనీల్ సుంకర) రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త విమర్శకుల ప్రశంసలు పొందకపోయినా, బాక్సాపీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు సాధించాయి. ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో, బయ్యర్లు డబ్బు బానే పెట్టారు. మరి దర్శకుడిగా ఈ వెలిగొండ శ్రీనివాస్ మొదటి సినిమా ఎలా సాగిందో మీరే చూడండి

కథలోకి వెళితే :

గౌతమ్ (రాజ్ తరుణ్) కి చిన్ననాటి నుంచే చూపు ఉండదు. ముగ్గురు స్నేహితులతో ఓ అనాథ ఆశ్రమంలో పెరిగి, వైజాగ్ లో రేడియా జాకిగా పనిచేస్తుంటాడు. ఓ అబద్ధం ఆడి నేత్ర (హెబాపటేల్) ని పడేస్తాడు. నేత్ర గౌతమ్ కి కళ్ళు వచ్చేలా చేస్తుంది. వీరి లవ్ స్టోరి కొన్ని కామెడి సీన్లు, ఓ రెండు గొడవలతో రొటీన్ గా సాగిపోతున్న తరుణంలో కథలోకి రంజీత్ కులకర్ణి (రాజేంద్రప్రసాద్‌) వస్తాడు. ఆ పాత్ర వలన గౌతమ్ కి పంతం బాబ్జీతో (రాజా రవీంద్ర) గొడవ మొదలవుతుంది. అసలు కులకర్ణి ఎవరు? పంతం బాబ్జీతో కులకర్ణి, గౌతమ్ .. ఇద్దరిలో ఎవరికి పగప్రతీకారాలు ఉన్నాయి? ఇదంతా తెరమీదే చూడండి.

నటీనటుల నటన :

రాజ్ తరుణ్ మెప్పించలేకపోయాడు. డైలాగ్ డెలివరి చాలా లౌడ్ గా, అవసరానికి మించిన పేస్ తో ఉంది. ఒకటి రెండు డైలాగులు ఆ ఫ్లోలో అర్థం కూడా కావు. గుడ్డివాడి పాత్ర కోసం స్పెషల్ కేర్ తీసుకోవడం పక్కన ఉంచితే, కనీసం లుక్స్ పరంగా కూడా ఏది కొత్తగా ప్రయత్నించట్లేదు రాజ్ తరుణ్. చేసిన ఒకటి రెండు ఫైట్స్ ఎందుకు అతనికి నప్పవు. హెబా పటేల్ అదే వరుస, అదే మూస. కనీసం ఆ డబ్బింగ్ ఆర్టిస్టుని మారిస్తే అయినా ఏమైనా ఫ్రెష్ నెస్ వస్తుందేమో. రాజేంద్రప్రసాద్ పాత్ర కూడా బాగా రాసుకోలేదు. ఆయన కామెడి టైమింగ్ కి సరిపడా సరుకు లేకపోవడంతో ఆయన కూడా తేలిపోయారు. నటుడిగా మార్క్ చూపించుకున్నది కేవలం రాజరవీంద్రనే. ఈ నెగెటీవ్ క్యారక్టర్ ని కూడా స్ట్రాంగ్ గా రాయకపోయినా, ఒకటి రెండు సీన్లను తన భుజాల మీదే లాగేసారు రాజరవీంద్ర.

టెక్నికల్ టీమ్ :

ఇలాంటి రొటీన్ సినిమాల్లో టెక్నికల్ టీమ్ గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది ? సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మెలోడిలు బాగా ఇస్తారు. తన స్టయిల్ కి వ్యతిరేకంగా ఒక కమర్షియల్ హంగులున్న ఆల్బమ్ ఇవ్వడానికి చాలా ప్రయత్నించినా, అది విఫలయత్నమే. పాటలు వింటూ సీట్లో కరెక్టుగా కూర్చోవడం కష్టం. కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఎడిటింగ్ దారుణం. అయినా, ఇలాంటి ఫక్తు కమర్షియల్ సినిమాల్లో దర్శకుడు చెప్పిందే చెల్లుతుందేమో .. ఎడిటర్ మాట పట్టించుకోరేమో. ప్రొడక్షన్ వాల్యూస్ ఏదో అలా ఉన్నాయి.

విశ్లేషణ :

సహజంగా ఓ కథలో ఏదైనా ట్విస్ట్ వస్తే షాక్ కి గురవ్వాలి. కథ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపించాలి. కాని ఈ సినిమాలో ఎక్కడైనా కామెడి ఉంది అంటే, అది మలుపుల దగ్గరే. ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ట్విస్టు కూడా కొత్తగా ఉండదు. ఇప్పటివరకు మనం వందల సినిమాల్లో చూసుంటాం ఈ రివేంజ్ మలుపులు. రాజేంద్రప్రసాద్ ఆత్మ అంటూ చేయించిన కామెడికి ప్రేక్షకులు నవ్విన సందర్భాలు వేల్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇక లాజిక్ లాంటి పదాన్ని పూర్తిగా పక్కనపెట్టండి, కమర్షియల్ గా అయినా అలరించారా అంటే అది కూడా లేదు. 20 రూపాయల టికేట్ కొనే మాస్ ప్రేక్షుకుడిని కూడా ఈ సినిమా సంతృప్తిగా థియేటర్లో కూర్చోబెట్టగలదు అనే నమ్మకం కలగడం లేదు. ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త కూడా మాస్ కామెడి సినిమాలే, కాని అంధగాడుతో పోల్చుకుంటే వాటిని కళాఖండాలు అనొచ్చేమో.

ప్లస్ పాయింట్స్ :

* కొన్ని చోట్ల పేలే మాస్ కామెడి

మైనస్ పాయింట్స్ :

* పదేళ్ళ క్రితమే పాతబడిన టేకింగ్

* చాలా రొటీన్ స్టోరి, కథనం

* పాటలు

* సిల్లిగా అనిపించే ట్విస్టులు

చివరగా :

అంధగాడుని గుడ్డిగా రాసేసారు

తెలుగుస్టాప్ రేటింగ్:2/5