టీడీపీలో క‌ల‌క‌లం... ఆ ఇద్ద‌రు ఔట్‌..!     2018-05-23   00:11:27  IST  Bhanu C

నెల్లూరు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జిల్లా రాజ‌కీయాలు పూట‌కో తీరుగా మారుతున్నాయి. ఇప్ప‌టికే అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేత‌ల‌తో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు పార్టీకి చేటు చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, టీడీపీ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌పై సోమిరెడ్డి గుర్రుగా ఉన్నారు. వారికి పార్టీలోనూ, జిల్లా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎలాగూ పోయింది. ఇక‌, టీడీపీలోనైనా గుర్తింపు ద‌క్కుతుంద‌ని భావించిన ఆనం.. టీడీపీలో చేరారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న పార్టీలో చేరి నాలుగేళ్లు గ‌డుస్తున్నా.. ఎలాంటి గుర్తింపూ లేకుండా పోయింది.

ఇదే విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన జిల్లా మినీ మ‌హానాడులో ప్ర‌స్తావించారు. రైతులను పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకున్న ఆనం రాంనారాయణరెడ్డి స్వయంగా వెళితే ఎస్‌ఐ, సీఐలు ఖాతరు చేయలేదు. ఈ విషయాన్ని మినీమహానాడులో ఆనం గుర్తు చేస్తూ.. 30 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తనకు ఈ మాత్రం విలువ కూడా లేకుండా పోయింద‌ని వాపోయారు. ఇదంతా మంత్రి సోమిరెడ్డి కుట్ర అని.. ఆనం త‌న అనుచ‌రుల‌తో బాహాటంగానే పేర్కొన‌డం పెను సంచ‌ల‌నంగా మారింది.