All Eyes on Vijayawada MP Seat

ఏపీలో రాజ‌ధాని కేంద్రంగా ఉన్న విజ‌య‌వాడ ఎంపీ సీటు కోసం అప్పుడే హాట్ హాట్‌గా ఫైట్ జ‌రుగుతోంది. అధికార టీడీపీతో పాటు ఆ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ నుంచి ఈ సారి ఇక్క‌డ పోటీ చేసేందుకు ఐదుగురు ప్ర‌ముఖులు పోటీప‌డుతున్నారు. దీంతో ప్ర‌స్తుత సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి బాగా చిర్రెత్తుకొచ్చేస్తోంది. ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న నాని మ‌రోసారి ఇక్క‌డ ఎంపీగా పోటీ చేయాల‌ని నిన్న‌టి వ‌ర‌కు అనుకున్నారు. అయితే ఇక్క‌డ నుంచి టీడీపీ, బీజేపీ త‌ర‌పునే మ‌రో న‌లుగురు పేర్లు వినిపిస్తుండ‌డం ఆయ‌న‌కు స‌హ‌జంగానే కాస్త మంట‌గా మారింది.

ఈ క్ర‌మంలోనే నానిని ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్పించేస్తార‌న్న ప్ర‌చారంతో ఆయ‌న టీడీపీతో పాటు ప్ర‌భుత్వంపై త‌ర‌చూ ఫైర్ అవుతున్నారు. నాని సంగ‌తి ఇలా ఉంటే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ టీడీపీలోకి వ‌స్తార‌ని, ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ సీటు నుంచి బ‌రిలోకి దిగుతార‌న్న ప్ర‌చారం కూడా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌డం కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ల‌గ‌డ‌పాటి లాంటి సీనియ‌ర్ పార్టీలోకి వ‌స్తానంటే చంద్ర‌బాబు సైతం వ‌దులుకోర‌న్న టాక్ న‌డుస్తోంది.

ఇక బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున విజ‌య‌వాడ సీటు కోరుకుంటున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన పురందేశ్వ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ బ‌రిలో దిగేందుకు అమిత్ షా ద్వారా పావులు క‌దుపుతున్నారు. ఇక కేంద్ర మంత్రి వెంక‌య్య సైతం త‌న కుమార్తె దీపాను ఇక్క‌డ నుంచి పోటీ చేయించేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆయ‌న చేస్తున్నారు.

ఇక చంద్ర‌బాబు త‌న కోడలు నారా బ్రాహ్మ‌ణిని ఇక్క‌డ నుంచి ఎంపీగా పోటీ చేయించాల‌ని ఆయ‌న ఓ వ్యూహంతో ఉన్నారు. ఏదేమైనా ఇలా ఐదుగురు ప్ర‌ముఖులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ+బీజేపీ కూట‌మి నుంచి పోటీ చేసేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. దీంతో బెజ‌వాడ రాజ‌కీయం ప‌క్క‌నే చ‌ల్ల‌టి కృష్ణా న‌ది ఉన్నా హీటెక్కుతోంది.