పూరి తర్వాత సినిమా ఫిక్స్‌.. మళ్లీ అదే తప్పు     2018-07-03   23:38:59  IST  Raghu V

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో మంచి చిత్రాలను తీయడంలో విఫలం అవుతున్నాడు. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో మూస తరహాలో సినిమాలను తెరకెక్కిస్తూ పూరి వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు. ఇటీవల ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్‌’ మరియు ‘మెహబూబా’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. పూరి మార్క్‌ ఆ చిత్రాల్లో ఏమాత్రం కనిపించలేదు. ఎన్నో చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్న పూరి జగన్నాధ్‌, ఎంతో మంది హీరోలకు లైఫ్‌ ఇచ్చాడు. కాని తన కొడుకుకు మాత్రం సక్సెస్‌ ఇవ్వడంలో విఫలం అయ్యాడు.

కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ‘మెహబూబా’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో పూరి నిర్మించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంతో పూరికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఇల్లు అమ్మి మరీ సినిమాను తెరకెక్కించగా, ఆ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా వసూళ్లు రాబట్టలేక పోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరి తన తదుపరి చిత్రాన్ని వేరే హీరోతో, బయట బ్యానర్‌లో చేయాలని భావించాడు. అయితే ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపడంలేదు. ఇక ఏ నిర్మాత కూడా ఈయనపై పెట్టుబడికి ఆసక్తి చూపడం లేదు.