టీడీపీలో టిక్కెట్ కోసం మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్సీ     2018-05-05   23:39:49  IST  Bhanu C

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఆదినారాయ‌ణ రెడ్డి గెలుపొందా రు. అయితే, టీడీపీ ఆక‌ర్ష్ ప్ర‌భావంతో ఆయ‌న పార్టీ జంప్ చేసి.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. అంతేకాదు, బాబు ఆశీస్సుల‌తో ఆయ‌న మంత్రిగా కూడా చ‌లామ‌ణి అవుతున్నారు. అయితే, రాజ‌కీయంగా మాత్రం జ‌మ్మ‌ల‌మ‌డుగు తీవ్రంగా ర‌గిలిపోతోంది. మరో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున పార్టీకి అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన ఎమ్మె్ల్సీ రామ‌సుబ్బారెడ్డికి, ఆదికి అస్స‌లు ప‌డడం లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈటికెట్ ఎవ‌రికి ఇస్తార‌నే విష‌యంలోనే ఈ ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో ఇద్ద‌రు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు, ప‌త్యారోప‌ణ‌లు చేసుకుంటూ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. వాస్త‌వానికి ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు, ఆరోప‌ణలు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. అయితే, అప్ప‌ట్లో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌వారు ఇప్పుడు ఒకే గొడుగు కింద‌కు చేరారు. వాస్త‌వానికి ఆదిని టీడీపీలోకి చేర్చుకునే స‌మ‌యంలోనే రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించాడు.

అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు రామ‌సుబ్బారెడ్డికి న‌చ్చ‌జెప్పి.. పార్టీని బ‌లోపేతం చేయ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం అనే రెండు అంశాల ఆధారంగా ఆదిని పార్టీలోకి తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. అదేస‌మ‌యంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. దీంతో కొంత మెత్త‌బ‌డిన రామ సుబ్బారెడ్డి.. త‌న ప‌నేదో తాను చేసుకుపోతున్నారు. అయితే, ఇంత‌లోనే మ‌రో ఏడాదిలో జ‌ర‌గ నున్న ఎన్నిక‌ల‌పై మంత్రి ఆది త‌న‌దైన శైలిలో స్పందించారు.