బయట దొరికే చికెన్ గురించి నమ్మలేని అయిదు చేదు నిజాలు

బయట చికెన్ షాపూలలో దొరికే సాధారణ బ్రాయిలర్ కోడి కన్నా, దేశి కోడి ధర ఎందుకు ఎక్కువ ఉంటుంది ? మనం కొనుక్కొని తినే చికెన్ రుచి కన్నా, ఏదైనా పల్లెటూరికి వెళ్ళినప్పుడు, చుట్టాలు ఇంట్లో కోసే కోడి రుచి ఎందుకు ఆకట్టుకుంటుంది ? ఈ తేడా ఎందుకు ? మతలబు ఏంటి ? అసలు మనం ఎప్పుడు తినే బ్రాయిలర్ చికెన్ మంచిదేనా ? అవి ఎందుకు తక్కువ ధరకి దొరుకుతున్నాయి ? చికెన్ ఇంత ఎక్కువ పరిమాణంలో మార్కెట్లో ఎందుకు దొరుకుతుంది ? మనం ఆరోగ్యకరమైన చికెన్ తింటున్నామా ? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీ మెదడుని తట్టాయా ? తట్టినా, తట్టకపోయినా, సమాధానాలు మేం చెబుతున్నాం. మనం తినే చికెన్ పూర్తిగా ఆరోగ్యకరం కాదు, రుచిగా ఉంది అంటే మీరు ఇంకా దేశి కోడి రుచి చూడనట్టే. ఎందుకు పూర్తిగా ఆరోగ్యకరం కాదు అంటే, కొన్ని చేదు కారణాలు ఉన్నాయి, కొన్ని చేదు నిజాలు ఉన్నాయి .. ఆ చేదు నిజాలు ఏంటో చూడండి.

#1. హార్మోన్ ఇంజెక్షన్లు

* ఇంట్లో పెరిగిన కోడి సహజసిద్ధంగా పెరుగుతుంది. అది త్వరగా పెరగాలని మనం ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వం.దాణా తప్ప ఇంకేమి పెట్టం. కాని బయట దొరికే బ్రాయిలర్ కోడి అలా కాదు. అది పెరిగే వాతావరణం చాలా వేరు. సమయానికి ఎన్ని కోడిలను సిద్ధం చేస్తే వ్యాపరదారులకి అంత లాభం. అందుకే వాటికి గ్రోత్ హార్మోన్స్ అందిస్తారు. యాంటిబయోటిక్స్ ఇంజెక్ట్ చేస్తారు. ఇది కొత్తగా మొదలైన ట్రెండ్ కాదు. 1980 లలో లేదా అంతకంటే ముందే మొదలైంది. అప్పట్లోనే ఎన్నో దేశాలు జంతువుల మాంసంలో సింథటిక్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడాన్ని బ్యాన్ చేసాయి.ఇంతలా వివాదాలు తలెత్తినా, పౌల్ట్రీ వ్యాపారస్తులు గ్రోత్ హార్మోన్స్ ఇవ్వడం మానట్లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ప్రాసెస్ ఎలాంటిది అనే, పచ్చిగా ఉన్న కాయను తీసుకొచ్చి, బలవంతగా పండులా మార్చడం. దాని వల్ల ఆ పండులో సహజసిద్ధమైన రుచి ఉండదు .. అది పక్కన పెడితే ఆ పండుకోసం వాడిన రసాయనాలు మన శరీరంలోకి వెళతాయి. ఇప్పుడు బ్రాయిలర్ కోడి విషయంలో మనకు జరుగుతున్నది అదే, వాటికి అందిస్తున్న హార్మోన్ ఇంజెక్షన్ల ప్రభావం మన శరీరం మీద కూడా పడవచ్చు.