ఓట్ల కోసం పాట్లు పడుతున్న పార్టీలు  

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. అదే ఎన్నికల సందడి. ఆ సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో పార్టీలన్నీ ఇప్పుడు జనాల్లో తిరగడానికి, వారి మద్దతు కూడ గట్టడానికి తంటాలు పడుతున్నాయి. అందుకే ఎప్పుడూ లేని ఆప్యాయతలు జనాల మీద చూపించేస్తున్నారు రాజకీయ నాయకులు. ప్రజల్లో ఎదో ఒక రకంగా గుర్తింపు పొంది నాలుగు ఓట్లు రాల్చుకోవాలన్న తపనతో తహతహలాడుతున్నారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన ఇలా ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఎన్నికల వాతావరణం ముంచుకు రావడంతో వివిధ పార్టీల్లోని కార్యకర్తలకు మంచి టైమొచ్చింది. తమకు కావల్సిన పనులు ఇప్పించకపోతే.. పార్టీ మార్పు తప్పదని నాయకులను బెదిరిస్తున్నారు. బూత్ స్థాయి వరకు కార్యకర్తల బలం ఇప్పుడు కీలకం కావడంతో అంతా వారిని బుజ్జగిస్తున్నారు. కాస్త బలమైన ద్వితీయశ్రేణి నాయకులకు ఇతర పార్టీల నుంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి.

ప్రస్తుత పార్టీల పరిస్థితి చూసుకుంటే… జనసేన రూటే వేరుగా ఉంది. ఆయన సమస్యలపై పోరాడుతానంటూ.. దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఓట్లు సాధించే మాట ఎలా ఉన్నా.. ముందుగా జనంలోకి చొచ్చుకుపోయేందుకు జనసేన వ్యూహం రచిస్తోంది. సొంతంగా నెగ్గకపోయినా, ఎవరి ఓట్లకు గండికొడుతుందోనని ప్రధాన పార్టీలు రెండు తల పట్టుకుంటున్నాయి.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తామూ పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎన్నికల కమిటీ కన్వీనర్ సోము వీర్రాజు ముందే చెప్పారు. బూత్ కమిటీల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే ప్రయత్నాల్లో పడ్డారు. ఎలాగైనా తమ ఉనికి చూపించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ విషయానికి వస్తే… ఇప్పటికే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్తున్నారు. వీరి సభలకు సైతం జనం బాగానే వస్తుండ టం కాస్త ఆశాభావాన్ని కల్పిస్తోంది. దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పేరుతో నిత్యం జనాల్లో ఉండడంతో ఆ పార్టీకి బాగా కలిసొస్తుంది.

రాష్ట్ర విభజన తర్వాత పుట్టగతుల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా మళ్లీ కాస్త బలపడాలని ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే. గతంలో పార్టీని వీడిన వారంతా తిరిగిరావాలని పిలుపునిస్తున్నారు. ఇక అధికార పార్టీ టీడీపీ సంగతి అయితే చెప్పనవసరమే లేదు ఎందుకంటే ప్రజలను ఆకర్షించడానికి వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. వివిధ ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతూ జనాల్లో మార్కులు కొట్టెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.