2019లో మైల‌వ‌రంలో మొగాడు ఎవ‌రు?     2018-04-17   06:00:46  IST  Bhanu C

కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డుతోంది. ఇక్క‌డి నుంచి ఇప్ప‌టికే రెండు సార్లు గెలిచిన మంత్రి దేవినేని ఉమా, వైసీపీ త‌ర‌ఫున కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జోగి ర‌మేష్‌ల‌లో ఎవ‌రికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఇక్క‌డ క్లాస్ మాస్ రెండూ ఉన్నాయి. వీటికి తోడు కార్మిక కుటుంబాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక‌, సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే క‌మ్మ‌, రెడ్లు, కాపుల‌తో పాటు బీసీ, ఎస్సీ ఓట‌ర్లు ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొన్నేళ్లుగా క‌మ్మ వ‌ర్గానికి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వ‌స్తున్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం విజ‌య‌వాడ‌కు ఆనుకుని ఉండ‌డంతో ఇక్క‌డ సిటీ ప్ర‌భావం ఉంది. ఇక జి.కొండూరు, మైల‌వ‌రం, రెడ్డిగూడెం మండ‌లాలు వ్య‌వ‌సాయానికి ప్ర‌ధానంగా అనుకూలంగా ఉంటాయి.

నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్ద‌కాలంగా మంత్రి దేవినేని ఉమా ప్ర‌భావ‌మే ఇక్క‌డ కొన‌సాగుతోంది. జోగి ర‌మేష్ ప్రాబ‌ల్యం అంతంత మాత్ర‌మే. అయితే, గ‌డిచిన నాలుగు ఏళ్ల‌లో దేవినేని ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చేసింది ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్న వారూ ఇక్క‌డ ఉండ‌డం గ‌మ‌నార్హం. 2009, 2014లో ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో దేవినేని ఉమా రెండు సార్లూ విజ‌యం సాధించారు. అయితే, ఈ రెండు ద‌ఫాల్లోనూ 2014లో గెలిచిన త‌ర్వాత .. దేవినేని నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్థానికులు విమ‌ర్శిస్తున్నారు. అదేస‌మ యంలో పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల‌తోనే దేవినేని టైం గ‌డిచిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించ‌డంలో దేవినేని విఫ‌ల‌మ‌య్యార‌నే వాయిస్ వినిపిస్తోంది.