12 interesting facts about Abdul Kalam’s life

రెండేళ్ళ క్రితం, సరిగ్గా ఇదేరోజు. అదే షిలాంగ్ లోని IIM యూనివర్సిటీ. 83 ఏళ్ల యువకుడు (ఆయన పేరుకే వృద్ధుడు) వందలాది విద్యార్థులతో మాట్లాడుతున్నాడు. ఆయన సినిమా హీరో కాదు, కాని వరుసగా అయిదు సంవత్సరాలు యూత్ ఐకాన్ బిరుదు ఇచ్చి సత్కరించింది యువత. ఆయనేమో గొప్ప అందగాడు కాదు. కాని ఆయన నవ్వులో ఉండే స్వచ్చత, అందం .. ఏ అందగాడి నవ్వులో కూడా ఉండదు. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. భారతదేశ భవిష్యత్తు గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి. ఇంతలోనే కుప్పకూలిపోయాడు. అంతే, ఇక భవిష్యత్తులో నా గొంతు మీరు వినలేదు అంటూ స్వర్గానికి వెళ్ళిపోయాడు.

గాంధిని మనం చూడలేదు. మహాత్మని కూడా ద్వేషించే మనుషులు ఉంటారు. కాని కలాంని మనం చూసాం. ఆయన్ని ద్వేషించే ఒక్క మనిషిని కూడా చూడలేదు. చూడలేము కూడా. అలాంటి మహనీయుడి వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా, ఆయన జీవితాన్ని క్లుప్తంగా ఓ 12 పాయింట్స్ లో తెలుసుకోండి.

1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామాంతపూరంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు అబ్దుల్ కలాం.

* తండ్రి సంపాదన సరిపోక, 5 ఏళ్ల వయసు రాగానే న్యూస్ పేపర్ బాయ్ గా పనిచేయడం మొదలుపెట్టారు అబ్దుల్ కలాం. రాత్రుళ్ళు వీధి లైట్ కింద చదువుకునేవారు.

* ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ మీద ఆసక్తి పెంచుకున్న కలాం, 1954 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 1995లో మద్రాస్ యునివర్సిటి ఆఫ్ టెక్నాలజీలో చేరారు.

* కలాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలాట్ అవుదాం అనుకున్నారు. కాని ఎనిమిది పోస్టులు ఉంటే కలాం 9వ ర్యాంకు సాధించారు. అంటే త్రుటిలో మనం మన మిస్సైల్ మ్యాన్ ని, అత్యంత ప్రియమైన రాష్ట్రపతిని త్రుటిలో కోల్పోయేవారం అన్నమాట.

* 1969 లో ISROలో శాటిలైట్ లాంచ్ విభాగానికి డైరెక్టర్ గా నియమించబడ్డారు కలాం. ఆయన నాయకత్వంలో రోహిణి శాటిలైట్స్ ని ఆకాశానికి పంపించింది భారత్. అక్కడినుంచి ఆయనకీ మిసైల్ మ్యాన్ అనే పేరు వచ్చింది. ఆయన నాయకత్వం, విజ్ఞానంతో భారత్ టెక్నాలజీ పరంగా ఎన్నో విజయాలను సాధించింది.

* అణుశక్తి భారత్ దగ్గర కూడా కావాల్సినంత ఉంది నిరుపించినవాడు కలాం. ఆయన నాయకత్వం, మేధశక్తి మూలానే భారత్ 1999లో పోఖరాన్ 2 అణుశక్తి పరీక్షలు సఫలంగా పూర్తి చేసింది.

* ఆయన్ని 1981 లో పద్మభూషణ్ వరించింది. 1990 లో పద్మ విభూషణ్ గా ప్రమోట్ అయితే, 1997 లో ఏకంగా భారత రత్నతో సత్కరించింది అప్పటి ప్రభుత్వం.

* ఆయనకి 40 యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసాయి.

* ఆయన 15 పుస్తకాలు రాసారు. ఆయన ఆత్మకథ పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్. దీన్ని 13 భాషల్లోకి అనువదించారు ఆయనను అభిమానించే వారు. ఆయన జీవితం మీద మరో 6 బయోగ్రాఫీ పుస్తకాలు వచ్చాయి. తెలుగు నిర్మాత అనీల్ సుంకర ఆయన జీవిత చరిత్రని సినిమాగా తీస్తున్నారు.

* 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన కలాం, ఆ తరువాత ఆయన పదవి కాలాన్ని పొడిగిస్తామన్నా ఒప్పుకోలేదు. ఆయన రాష్ట్రపతిగా పొందిన జీతం మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఉపయోగించారు.

* మే 26న ప్రతి ఏటా స్విట్జర్లాండ్ లో నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. ఎందుకో తెలుసా ? ఓసారి సరిగ్గా అదేరోజు కలాం ఆ దేశాన్ని పర్యటించారు.

* పెళ్ళి చేసుకోలేదు. జీవితం మొత్తం దేశానికి, విద్యార్థులకే సమర్పించారు. రాష్ట్రపతి పదివికాలం పూర్తయిన తరువాత కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పారు. 27 జులై, 2015 .. ఆయన చనిపోయిన రోజు కూడా షిలాంగ్ లో వందలాది విద్యార్థులకి తన అనుభావాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రసంగం మధ్యలోనే కార్డియాక్ అరెస్ట్ తో అక్కడే చనిపోయారు కలాం.