సైరా విషయంలో అతి..     2018-06-01   23:10:49  IST  Raghu V

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు రచన సహకారంను పరుచూరి బ్రదర్స్‌ అందిస్తున్నారు. భారీ యుద్ద సన్నివేశాలు, భారీ సెట్టింగ్స్‌లో ప్రముఖ తారాగాణం సమక్షంలో సీన్స్‌ను తెరకెక్కిస్తున్న కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమా ప్రకటించిన తర్వాత సెట్స్‌ పైకి వెళ్లడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరం పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ అంటూ జరుపుతూ వచ్చారు.

సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మొదటి నుండి ఈ చిత్రంను 2018 చివర్లో లేదా 2019 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. 2019 సంక్రాంతికి కూడా రావడం లేదని, అదే సంవత్సరం వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ సినిమా పడుతుంది. ఇంత భారీగా ఏం చేస్తున్నారు, ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు అంటూ సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.