వాళ్లిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు... ఖ‌మ్మంలో గులాబీకి ఇక తిరుగే లేదు..    2018-04-24   22:10:09  IST  Bhanu C

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మధ్య రాజకీయ వైరానికి తెరపడినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో గల మంత్రి, ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విబేధాల ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సరికొత్త స్నేహాన్ని ఆవిష్కరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెడుతున్న నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థులు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, జలగం కుటుంబాలకు మధ్య దశాబ్ధ కాలంగా రాజకీయ వైరం ఉంది. ఈ రెండు కుటుంబాలు సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ వేదికగా అనేక ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. గెలుపు, ఓటములు ఎలా ఉన్నా జలగం వెంగళరావు హయాంలో మొదలైన ఈ రాజకీయ వైరం నేటికీ కొనసాగుతోంది.

సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 1985, 94, 99 ఎన్నికల్లో మూడుసార్లు తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. తుమ్మల గెలిచిన ఆయా సంవత్సరాల్లో మినహా మిగతా అనేక ఎన్నికల్లో జలగం కుటుంబం నుంచి వెంగళరావు, వెంకటరావు, ప్రసాదరావు విజయం సాధించారు. ఈ పోటీలో స‌త్తుప‌ల్లిలో జ‌ల‌గం కుమారులు ప్ర‌సాద‌రావు, వెంక‌ట‌రావు చేతుల్లో ఓడిన తుమ్మ‌ల మ‌ళ్లీ వీరిద్ద‌రిని ఓడించాడు. కాగా నియోజకవర్గాల పునర్విభజనలో సత్తుపల్లి సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో తుమ్మల తన మకాం ఖమ్మం జిల్లా కేంద్రానికి మార్చారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు.