వరుణ్‌ తేజ్‌ కూడా.. నేనేమైనా తక్కువోడినా?     2018-06-06   01:17:59  IST  Raghu V

తెలుగు హీరోలు ప్రస్తుతం రెండు చేతులతో సంపాదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్‌ హీరోలతో పోల్చితే ప్రస్తుత హీరోలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. సక్సెస్‌ ఉండేది ఎంతకాలమే, హీరోగా నిలిచేది ఎన్నేళ్లో తెలియదు కనుక, క్రేజ్‌ ఉన్నప్పుడే దాన్ని వాడేసి ఫుల్‌గా సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అందుకోసమే వచ్చిన ప్రతి అవకాశంను వదులుకోకుండా సినిమాలు చేయడంతో పాటు, పారితోషికం విషయంలో పకడ్బందీగా ఉంటున్నారు. ఇక ఈతరం హీరోలు సినిమాలతో పాటు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం చేస్తున్నారు.

టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌బాబు అత్యధికంగా కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈయన ఇంకా ఎక్కువ సంఖ్య బ్రాండ్స్‌కు ప్రమోషన్‌ చేశాడు. ప్రస్తుతం కాస్త తగ్గించాడు, కాని పారితోషికంను మాత్రం పెంచాడు. సినిమాల ద్వారా కాకుండా అత్యధిక ఆదాయంను పొందుతున్న హీరోల్లో మహేష్‌బాబు ముందు ఉన్నాడు. మహేష్‌బాబు దారిలోనే పలువురు హీరోలు కూడా తమ స్థాయికి తగ్గట్లుగా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మెగా హీరో రామ్‌ చరణ్‌ కూడా ఒక ప్రముఖ మొబైల్‌ స్టోర్‌కు ప్రచారకర్తగా ఎంపిక అయ్యాడు.