రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి షాకే...     2018-05-26   00:10:31  IST  Bhanu C

ఈ ఏడాది చివ‌ర‌లో రాజస్థాన్‌లో, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఈరెండు రాష్ట్రాల్లోనూ బీజీపీ త‌న అధికారాన్ని కోల్పోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఏబీపీ-సీఎస్‌డీఎస్ మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికప్పుడు జరిగితే కాంగ్రెస్‌కు 49%, భాజపాకు 34%, ఇతరులకు 17% ఓట్లు లభించే అవకాశముంద‌ని స‌ర్వేలో తేలింది. రాజ‌స్థాన్‌లో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 44%, బీజేపీకి 39%, ఇతరులకు 17% ఓట్లు లభించే అవకాశముందని స‌ర్వేలే తేలింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వేగంగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి. బీజేపీని ఓడించ‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతున్నాయి. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013లో బీజేపీ 45.50% ఓట్లతో 163 స్థానాలు గెలుచుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ 55.1% ఓట్లతో మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లోనూ విజ‌యం సాధించింది. అయితే ఇటీవల అజ్మీర్‌, అల్వార్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్‌ స్థానాలను కోల్పోయింది. ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచింది. 1998 నుంచి రాజస్థాన్‌లో ప్రతి అయిదేళ్లకోసారి పార్టీలు మారుతున్నాయి.