రాజమౌళి పాపులారిటిని వాడుకుంటున్న మెగాస్టార్

ఎస్.ఎస్.రాజమౌళి, ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి. ఈ ముగ్గురి కెరీర్ ని ఏమాత్రం సందేహం లేకుండా బాహుబలికి ముందు, బాహుబలి తరువాత అని విభజించుకోవచ్చు. కేవలం తెలుగు వరకే నెం1 డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి ఇప్పుడు ఆలిండియా నెం1. ఒక తెలుగు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్. బాక్సాఫీసు పుల్ లేక ఇబ్బందులు పడ్డ రానా ఇప్పుడు తేడాకొట్టిన టాక్ తో కూడా నితిన్ ని ఓడించాడు. ఇన్ని మార్పులు జరిగాయి బాహుబలి వలన. అందుకే, ఆ రేంజ్ ని, ఆ రీచ్ ని అర్థం చేసుకోనే, జక్కన్న పాపులారిటీని వాడుకునే పనిలో పడ్డారు మెగాస్టార్.

ఈ నెల 22న మెగాస్టార్ పుట్టినరోజు. అదేరోజు చిరంజీవి తన 151వ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం, కేవలం తెలుగు మార్కేట్ నే కాదు, హిందీ, తమిళం మరియు మలయాళ మార్కేట్స్ ని కూడా పలకరించనుంది. అందుకే, అన్ని ఇండస్ట్రీల్లో ఫస్ట్ లుక్ హైప్ రావాలని చిరంజీవి రాజమౌళి పాపులారిటీ ని వాడుకోనున్నారట. దానర్థం, ఆ సినిమా ఫస్ట్ లుక్ ని రాజమౌళి విడుదల చేయనున్నారు.

ఇది ఇండియా మొత్తం వెళ్ళాల్సిన సినిమా కాబట్టి, టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి బదులుగా “మహవీర్” అని పెట్టనున్నారని టాక్. పాన్ ఇండియా అపీల్ కోసం వివిధ ఇండస్ట్రీలలోని నటులను తీసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి మరియు సుదీప్ ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన నటులు. హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ పేరు పరిశీలనలో ఉంది. రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారు.