రమణదీక్షితులు తప్పు చేస్తున్నాడా..? వెంకన్న పరువు తీస్తున్నాడా ..?     2018-06-09   22:12:12  IST  Bhanu C

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను తమ స్వార్ధం కోసం, రాజకీయం కోసం దిగజార్చేస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరిది అనే ప్రశ్న కొంచెంసేపు పక్కన పెడితే.. ప్రతిష్టాత్మాకమైన ఆలయ పవిత్రత ఈ గొడవల వలన మసకబారుతోంది అనేది వాస్తవం. ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ ..? ఆయన వెళ్తున్న మార్గం సరైనదేనా ..? అసలు ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు తత్తరపాటు పడుతోంది అనే ప్రశ్నలు అనేకం ఇప్పుడు జనాల్లో మెదులుతున్నాయి. ఏది ఏమైతేనేమి వెంకన్న పరువును మాత్రం బజారుకి లాగేశారు.

శ్రీవారి ఆభరణాలు చోరీ అయ్యాయని, పింక్ డైమాండ్ మాయం చేశారనని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అదంతా ఉత్తిదే అని టీటీడీ ఈవో. వివరణ ఇచ్చారు. రమణ దీక్షితులు టీడీపీ పై ఆరోపణలు చేస్తుంటే, టీడీపీ అందుకు ప్రత్యారోపణలు చేస్తోంది. ఇంతలోనే ఆయన ప్రతిపక్ష నేత జగన్ ను కలవడం రాజకీయంగా సంచలనం రేపింది. ఆయనపై టీడీపీ నాయకులు విమర్శల బాణాలు గట్టిగానే వదిలారు. రమణ దీక్షితులు చంద్రబాబును అపాయింట్ మెంట్ అడిగారన్నది అవాస్తవమని, తిరుమల వెళ్లిన సమయంలో సీఎం చాలా సార్లు కలిసినా, అప్పుడెందుకు తన ఇబ్బందుల్ని, సమస్యల్ని రమణ దీక్షితులు చెప్పుకోలేదు అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. రమణ దీక్షితుల వెనుక రాజకీయశక్తులున్నాయని, ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం, వైసీపీ అధినేత జగన్ ను కలవడం చూస్తేనే ఇందులో రాజకీయం అర్ధం అవుతుందని టీడీపీ విమర్శిస్తోంది.