‘రంగస్థలం’ ఇలా ముగిసింది     2018-06-07   00:52:06  IST  Raghu V

రామ్‌ చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కి మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంతో ఈ సంవత్సరం వేసవి ప్రారంభం అయ్యింది. వేసవి ముగిసే వరకు కూడా రంగస్థలం జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా సినిమా అక్కడక్కడ ఆడుతూనే ఉంది. ఈమద్య కాలంలో సినిమాలు వారం రెండు వారాలు ఆడటమే గగనం అయ్యాయి. అలాంటిది ఈ చిత్రం ఇంకా కూడా ప్రదర్శింపబడుతుంది అంటే సినిమా ఏరేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెవిటి వాడు చిట్టిబాబు పాత్రలో రామ్‌ చరణ్‌ నటించిన విషయం తెల్సిందే.

ఈ చిత్రం మొదటి వారంలోపే వంద కోట్లను సునాయాసంగా రాబట్టింది. ఇక ఈ చిత్రంతో రామ్‌ చరణ్‌ మొదటి సారి ఓవర్సీస్‌లో టాప్‌ పొజీషన్‌ను దక్కించుకున్నాడు. సుకుమార్‌ బ్రాండ్‌ వ్యాల్యూ మరియు సినిమాకు ఉన్న భారీ క్రేజ్‌ నేపథ్యంలో ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రామ్‌ చరణ్‌ నటించిన ఏ సినిమా కూడా 100 కోట్ల షేర్‌ను దక్కించుకోలేదు. కాని ఈ సినిమా మాత్రం ఏకంగా 125 కోట్ల షేర్‌ను దక్కించుకుని టాప్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది. కేవలం షేర్‌ మాత్రమే కాకుండా గ్రాస్‌ కలెక్షన్స్‌ విషయంలో కూడా రామ్‌ చరణ్‌ సినిమా రికార్డును దక్కించుకుంది.