యుద్ధం శరణం మూవీ రివ్యూ

చిత్రం : యుద్ధం శరణం
బ్యానర్ : వారాహి చలన చిత్రం
దర్శకత్వం : కృష్ణ మరిముత్తు
నిర్మాత : సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి
సంగీతం : వివేక్ సాగర్
విడుదల తేది : సెప్టెంబర్ 8, 2017
నటీనటులు : నాగచైతన్య, శ్రీకాంత్, లావణ్య త్రిపాటి, రావు రమేష్, రేవతి తదితరులు

కథలోకి వెళితే :

ఒక మినిస్టర్ (వినోద్ కుమార్) 3 వేల కోట్ల స్కాం నుంచి అందరి దృష్టిని మళ్ళించేందుకు నగరంలో ఓ పెద్ద బాంబు ఎటాక్ ప్లాన్ చేస్తాడు. ప్లాన్ మినిస్టర్ ది అయితే, దాన్ని అమలుపరిచేవాడు నాయక్ (శ్రీకాంత్). ఈ దాడుల్లో తన తల్లిదండ్రులను కోల్పోతాడు అర్జున్ (నాగచైతన్య). సంతోషంగా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకపోయినా, అనుబంధాలతో ఉన్న కుటుంబం ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోతుంది. అక్కడితో ఆగని నాయక్, అర్జున్ తో మిగిలి ఉన్న మిగితా కుటుంబసభ్యులని కూడా బలి తీసుకోవాలనుకుంటాడు.

అసలు ఈ బాంబు బ్లాస్టులకి అర్జున్ కుటుంబానికి ఏమిటి సంబంధం? అర్జున్ తన పగ తీర్చుకున్నాడో లేదో తెర మీద చూడండి.

నటీనటుల నటన :

నాగచైతన్యకి కెరీర్ కి ఇది ఓ కొత్త పాత్రనా అంటే చెప్పలేం. మంచి ఇంటన్సిటి ఉంటుంది. కాని సరిగా రాసుకొని సన్నివేశాల వలన పాత్రలో బరువు కనిపించదు. అయినాసరే, తనవంతు కృషి చేసాడు చైతన్య. సినిమా తేడా కొట్టినా, చైతన్య మాత్రం ఫెయిల్ అవ్వడు. గ్రే క్యారక్టర్ లో శ్రీకాంత్ ఆదరగోట్టినా, తన పాత్ర నిడివి తక్కువగా ఉండటం ప్రేక్షకుల దురదృష్టం. ఫస్టాఫ్ లో అయితే విలన్ లా కాకుండా, ఎదో కామియో రోల్ లో ఉన్నాడా అనిపిస్తుంది. శ్రీకాంత్ కాలిబర్ కి ఇంకా బాగా రాసుకోవాల్సింది సన్నివేశాలు. నటనాపరంగా చెప్పుకుంటే, శ్రీకాంత్ ఈ చిత్రానికి అతిపెద్ద హైలెట్. లావణ్య అందంగా ఉంది. ఉన్నంతలో బాగానే చేసింది. ఇటు రావు రమేష్, అటు రేవతి .. ఇద్దరు షరామామూలే. తమ పాత్ర పరిధి మేరలో తమకు అలవాటు అయిన నటనని కనబరిచారు.