మొదటి సినిమాకే ఇంత పెద్ద భారమా?(టైటిల్‌ను మోయగలడా?)     2018-05-24   01:04:27  IST  Raghu V

మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండవ భర్త అయిన కళ్యాణ్‌ చూడ్డానికి చక్కగా, హీరోలా ఉంటాడు. అందుకే ఆయన హీరో అయిపోవాలని కలలు కన్నాడు. మెగాస్టార్‌ అు్లడు కల కనడం, అది నెరవేరకుండా ఉండటమా, అనుకున్నట్లుగానే ఆయన సినిమా హీరో అయ్యాడు. అది కూడా లాంచనంగా, పెద్ద సినిమాతో కళ్యాణ్‌ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. అంతా కూడా కళ్యాణ్‌ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కళ్యాణ్‌ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇక తాజాగా ఈ చిత్రానికి ‘విజేత’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్‌ లోగోను విడుదల చేశారు. చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రం అయిన విజేత టైటిల్‌ను కళ్యాణ్‌ మొదటి సినిమాకు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఇది పెద్ద సాహసం అని, ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.