‘మహానటి’పై అలిగిన సంజయ్‌ కిషోర్‌     2018-05-26   06:36:46  IST  Raghu V

తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న ‘మహానటి’ చిత్రంపై మొన్నటి వరకు జెమిని గణేషన్‌ కూతురు కమలా మాత్రమే విమర్శలు చేశారు. సినిమాలో తన తండ్రిని తప్పుగా చూపించారు అని, ఆయన గొప్ప నటుడు అనే విషయాన్ని చిత్రంలో చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో వ్యక్తి కూడా ‘మహానటి’ చిత్రంపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మహానటి చిత్రంపై అనే కంటే మహానటి దర్శకుడిపై అనడం బెటర్‌. ఎందుకంటే ఆయన్ను మహానటి దర్శకుడు గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మరెవ్వరో కాదు సావిత్రి గారికి వీరాభిమాని అయిన సంజయ్‌ కిషోర్‌.

సావిత్రి గారు జీవించి ఉన్నప్పటి నుండి ఆమెకు సంబంధించిన అనే విషయాలను, వివరాలను సంజయ్‌ కిషోర్‌ కలెక్ట్‌ చేసి పెట్టుకున్నాడు. సావిత్రి గారి గురించి ఎందరో ఎన్నో పుస్తకాలను రాశారు. వారంతా కూడా సంజయ్‌ కిషోర్‌ నుండి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఆయన చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకు వచ్చారు. మహానటి చిత్రం అనుకున్నప్పుడు నాగ్‌ అశ్విన్‌కు కూడా పలువురు సంజయ్‌ కిషోర్‌ను సంప్రదించాలని సలహా ఇచ్చారట. సంజయ్‌ కిషోర్‌ను మూడు నాలుగు సార్లు నాగ్‌ అశ్విన్‌ తన టీంతో కలవడం జరిగింది. ఆ సమయంలో సంజయ్‌ కిషోర్‌ తన వద్ద ఉన్న పలు ఇన్‌పుట్స్‌ను ఇచ్చాడట.