బీజేపీ ప్ర‌శాంతం.. టీడీపీలో తీవ్ర గంద‌ర‌గోళం..!     2018-05-29   23:12:24  IST  Bhanu C

ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఇప్పుడు తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి లోకేష్‌లు తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన మ‌హానాడు మూడు రోజులూ ఇదే ఆందోళన ఈ ఇద్ద‌రిలోనూ క‌నిపించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలోత‌మ‌కు ప్ర‌థ‌మ శ‌త్రువు బీజేపీ యేన‌ని ఇద్ద‌రూ ఆరోపించారు. బీజేపీకి బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు. అదేస‌మ‌యంలో ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని చ‌ర్విత చ‌ర్వ‌ణంగా మ‌ళ్లీ ఏక‌రువు పెట్టారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని అన్నారు. బీజేపీతో కుమ్మ‌క్క‌యిన జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను తిప్పికొట్టాల‌ని పిలునిచ్చారు.

మొత్తంగా మ‌హానాడు మూడు రోజులూ.. బీజేపీ టార్గెట్‌గానే ప్ర‌సంగాలు పేలాయి! అయితే, ఈ విష‌యంలోనే విశ్లేష‌కులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఏపీలో అస‌లు ఉనికిలో కూడా లేని బీజేపీ గురించి చంద్ర‌బాబు ఇంత‌గా ఎందుకు ఆందోళ‌న చెందుతున్నారు? అనేది వీరి ప్ర‌ధాన ప్ర‌శ్న‌. నిజానికి 2014 ఎన్నిక‌ల‌ను తీసుకున్నా.. 4% ఓటు బ్యాంకు కూడా బీజేపీకి న‌మోదు కాలేదు. పోనీ.. ఈ నాలుగేళ్ల‌లో పుంజుకుందా? అంటే.. అది కూడా లేదు. మ‌రి ఇంత‌గా చంద్ర‌బాబు ఎందుకు క‌ల‌వ‌ర ప‌డుతున్నారు? అనేది మ‌రో ప్ర‌శ్న‌. రాజ‌కీయంగా చంద్ర‌బాబు తీవ్రంగా మ‌థ‌న ప‌డుతున్న‌ది బీజేపీ గురించే!