బాబోయ్ బాబు ! మోదీని అనవసరంగా కెలుకుతున్నాడా ..?     2018-06-07   02:31:35  IST  Bhanu C

నోటితో నవ్వి నొసటితో వెక్కిరించుకోవడం రాజకీయాల్లో మాములే. రాజకీయ స్నేహాలు ఎలా ఉంటాయంటే అవసరం ఉన్నంతవరకు భుజం భుజం రాసుకు తిరుగుతారు.. అవసరం లేదనుకుంటే ఆ భుజాలనే నరకాలని చూస్తారు. ఇవన్నీ రాజకీయాల్లో షరా మామూలు వ్యవహారాలే ! సరిగ్గా ఇలాంటి పనే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్ర్య్ చంద్రబాబు కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. నాలుగేళ్లపాటు బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగి .. వారు ఏది చెప్తే అదే వేదం అన్నట్టు వ్యవహరించాడు. ఆఖరికి ఏపీకి హోదా ఇవ్వం .. ప్యాకేజ్ ఇస్తాం అని కేంద్రం చెప్తే దానికి కూడా తల ఊపిన చంద్రబాబు బీజేపీతో క్రమక్రమంగా దూరం పెరగడంతో దోస్తీకి కటీఫ్ చెప్పేసాడు.

బీజేపీతో స్నేహం ఉన్న నాలుగు సంవత్సరాలు ఒక్కమాట కూడా అనకుండా ఇప్పుడు తీవ్ర స్థాయిలో బీజేపీపై ఎదురు దాడి చేస్తున్నాడు. ఆయన విమర్శలు ఈ మధ్యన శృతి మించినట్లుగా కనిపిస్తోంది. అవసరం ఉన్నా.. లేకున్నా.. ఏదోలా మోడీషాలను కెలకటమే తన లక్ష్యమన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయ దూషణలు కాస్తా.. వ్యక్తిగత స్థాయికి పడిపోవటం చూసినప్పుడు బాబు అనవసరంగా మోదీతో పెట్టుకుంటున్నాడా అనే సందేహం కలుగుతోంది.