బాబుకు మ‌రో కొత్త త‌ల‌నొప్పి మొద‌లు

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లేద‌ని కేంద్రం ఏ రోజైతే స్ప‌ష్టంచేసిందో అప్ప‌టి నుంచి తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య విభేదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. పార్టీ బ‌లోపేతానికంటూ ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోని అసంతృప్తి సెగ‌లు సీఎం చంద్ర‌బాబుకు త‌గులుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌యమే ఉండ‌టంతో.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల కోసం పోటీ మొద‌లైంది. ఇప్ప‌టికే నెల్లూరు, క‌డ‌ప‌, వంటి జిల్లాల్లో ఇటువంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతుంటే.. కొత్త‌గా మ‌రో త‌ల‌నొప్పి చంద్ర‌బాబు స్టార్ట్ అయింది. నంద్యాల‌లో గంగుల ప్ర‌తాప రెడ్డి చేరిక‌.. కొన్ని స‌మస్య‌ల‌కు చెక్ పెట్ట‌గా.. మ‌రికొన్నింటికి ఆజ్యం పోసింది.

నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఊహించని విధంగా టీడీపీలో చేరడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. భూమాకు ప్రత్యర్థులుగా నిలిచిన గంగుల కుటుంబీకుల్లో ప్రభాకర్‌రెడ్డి ఒక‌రు. ఫ్యాక్షన్‌ రాజకీయాల పుట్టినిల్లుగా పేరుగాంచిన ఆళ్ళగడ్డలో భూమా, గంగుల కుటుంబాల మధ్యే ఘర్షణలు నడిచాయి. రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.