ప్రజల మద్దతు ఏ పార్టీకి అంటే..? ఆ సర్వే లో తేలింది ఇదే !     2018-05-30   01:19:08  IST  Bhanu C

రాజకీయ పార్టీలకు సర్వేలు చేయించుకోవడం అలవాటే. ఆ సర్వేల ద్వారా రాష్ట్రంలో తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ..? ఇంకా తమ నుంచి ఏమి ఆశిస్తున్నారు..? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుంటారు. తద్వారా తమ ఎత్తులు పై ఎత్తులు అమలుచేస్తుంటారు. ఇది అన్ని పార్టీల్లోనూ సర్వ సాధారణంగా ఉండేదే . ఇక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ఈ సర్వేలకు బాగా డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే ఇటీవల కర్ణాటక ఫలితాల మీద సర్వే చేసిన సంస్థ ఏపీలో కూడా తాజాగా సర్వే చేపట్టిందట. దీంట్లో దిమ్మతిరిగే విషయాలు బయటపడడంతో రాజకీయ పార్టీల్లో కంగారు మొదలయ్యింది.

ఆ సర్వే సంస్థ బయటపెట్టిన వివరాల ప్రకారం .. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందని.. ఆయన వల్లే రాష్ట్రం ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ముందుకు ముందుకు వెళ్తోందని ఎక్కువమంది సంతృప్తి వ్యక్తం చేశారట. పెన్షన్‌.. రేషన్‌ నెలనెలా అందుతోందని.. చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడని, గ్రామాలలో రోడ్లు వేస్తున్నారని.. విద్యుత్‌ సరఫరా బాగుందని పలువురు సర్వే సంస్థకు వివరించారు. కేంద్రం అన్యాయం చేసిందని చాలా మంది చెప్పారట.

అయితే కొంతమంది మాత్రం రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.. సకాలంలోనే పోలవరం పూర్తవుతుందనే విశ్వాసం ఎక్కువమంది వ్యక్తపరిచారట. కానీ అంతా బాగానే ఉంది కానీ.. ఎమ్మెల్యేల అవినీతిపై చాలామంది పెదవి విరిచారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చకచకా జరిగేవని.. ప్రస్తుతం పనులు జరగకపోగా.. అవినీతి పెరిగిపోయిందని నిరసన వ్యక్తం చేశారు. కొన్ని ప్రధాన నగరాలలో ప్రజా ప్రతినిధుల పనితీరుపై సర్వేలో అసంతృప్తి వ్యక్తమయ్యింది..