పశ్చిమలో 'కొత్త ' రాజకీయాలు...తెరపైకి వస్తోంది వీరే ..?     2018-05-25   03:35:53  IST  Bhanu C

రాజకీయంగా గోదావరి జిల్లాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీనే అధికారం చేజిక్కించుకోవడం పరిపాటి. మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని తేల్చాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ మొత్తం అన్ని సీట్లు టీడీపీ సొంతం చేసుకుంది. ( పొత్తులో భాగంగా ఒక అసెంబ్లీ , ఒక పార్లమెంట్ బీజేపీకి టీడీపీ కేటాయించింది.) ఆ తరువాత అధికార పీఠం ఆ పార్టీ దక్కించుకుంది. ఈ సారి గతంలోలా బలం నిలుపుకోవాలని టీడీపీ తహతహలాడుతుండగా.. కొంతైనా ఆ పార్టీని దెబ్బ తీయాలన్న ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.

బీజేపీతో టీడీపీ మైత్రి చెడిపోవడంతో నర్సాపురం పార్లమెంట్, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ లో కొత్త ముఖాలు తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీ లో కూడా ఈ సారి గతంలో పోటీ చేసిన వారి స్థానంలో కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగబోతున్నారు.