పవన్ ప్రశ్నించాడు సరే ! పరిష్కారాలు చుపాడా..?    2018-06-28   03:58:57  IST 

ప్రశ్నించడం పరిష్కారం వెతకడం అనే సిద్ధాంతంతో అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించి పరిష్కారం వెతికేశా అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే ఆ గొప్పలు తాత్కలికంగానే పనిచేస్తున్నాయి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడంలేదు.

పవన్‌కళ్యాణ్‌ కొంతకాలంగా ఉత్తరాంధ్ర మీద ద్రుష్టి పెట్టారు. ఎన్నికలే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్రను ప్రారంభించారు. కొన్నాళ్ళపాటు ‘షో’ నడిచింది. ‘రంజాన్‌’ పేరుతో కొన్నాళ్ళు ఆ ‘షో’కి విరామం ప్రకటించారు పవన్‌కళ్యాణ్‌. ఇప్పుడేమో, ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశమంటున్నారు. ఆ మేధావుల నుంచి ఉత్తరాంధ్ర సమస్యల గురించి తెలుసుకుంటున్నానంటున్నారు.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతం రెండు మూడు దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో సతమతం అవుతోంది. కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా వుంటానంటూ అప్పట్లో పవన్‌ చేసిన ప్రకటన సంచలనమే అయ్యింది. ఓ విదేశీ యూనివర్సిటీకి చెందిన వైద్య బృందాన్ని పవన్‌, ఉద్దానంకు రప్పించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించినట్టే కనిపించింది. ఇది జనసేన ఖాతాలో కూడా వేసేసుకున్నారు. చివరకి చూస్తే ఫలితం మాత్రం సున్నా.