న‌మ్మి వెంట న‌డిస్తే త‌మ్ముళ్ల‌నే ముంచేస్తున్న మంత్రి  

నాటి నుంచి నేటి వరకు ఆది తన గెలుపు పరంపరను కొనసాగించారు. ఇలా తనకు రాజకీయ అవకాశం కల్పించిన అన్న నారాయణరెడ్డి రుణం తీర్చుకునే దానిలో భాగంగా ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డిని రాజకీయ వారసుడిగా ఆది ప్రకటిస్తూ వచ్చారు. మంత్రి అయిన తర్వాత ఆది చర్యలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండటమే కాకుండా తన సొంత కుమారుడు సుధీర్‌రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకుని వస్తుండటం అన్నదమ్ముల మధ్య గ్యాప్‌నకు కారణమైంది. సుధీర్‌రెడ్డికి జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవిని ఇప్పించుకునే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ విషయంలో తన చిరకాల ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గం నుంచి అవరోధాలు ఎదురైనప్పటికి పట్టుబట్టి మరి తన కుమారుడు సుధీర్‌రెడ్డికి పదవి ఇప్పించుకోగలిగారు.

రెండేళ్ల క్రితం ఆయన వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే సమయంలో అన్నదమ్ములందరనీ ఏకం చేసి సీఎం వద్ద తన బలగాన్ని ప్రదర్శించారు. అన్నదమ్ములకు ఇచ్చిన హామీలను మరచి నాటి నుంచి నేటి వరకు వీరిని ఒక్కసారి కూడా సీఎంతో భేటీ చేయించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మైలవరం జలాశయం గేట్లు ఎత్తే సమయంలో కూడా మైలవరం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న భూపేష్‌రెడ్డి గైర్హాజరు కావడం వారి మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలకు బలం చేకూర్చుతుంది. కలహాలు ఇలాగే కొనసాగితే మరి కొద్దిరోజుల్లోనే కుటుంబసభ్యులు బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగురవేసే పరిస్థితి ఎదుర‌వుతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.