తెలంగాణాలో ముందస్తు కంగారు ! స్పీడ్ పెంచిన 'కారు'     2018-06-22   02:17:45  IST  Bhanu C

కొద్ది రోజులుగా కారు స్పీడ్ జోరందుకుంది. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కేసీఆర్ లో ఎక్కడ లేని కంగారు మొదలయ్యింది. అందుకే కారు స్పీడ్ పెంచే పనిలో పడ్డారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని కేసీఆర్ కి సమాచారం అందడంతోనే… ‘టార్గెట్‌ నవంబరు’ లక్ష్యంగా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. ‘ముందస్తు’ అంచనాలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

ప్రధాని మోదీ జమిలి ఎన్నికల ఆలోచన చేస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది నవంబరు-డిసెంబరుల్లోనే ఎన్నికలు వస్తాయనే కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్‌.. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి కొంత స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయని, అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చింది.