ఛీఛీ.. ఆయనతో సినిమా చేస్తానా?     2018-05-30   00:54:04  IST  Raghu V

వరుసగా మూడు నాలుగు సక్సెస్‌లు దక్కించుకున్న దర్శకుడు ఒక ఫ్లాప్‌ సినిమాను తీస్తే ఆయన కెరీర్‌ పెద్దగా ఎఫెక్ట్‌ అవ్వదు. కాని ఒక్కటే మంచి సినిమా తీసి, ఆ తర్వాత ఫ్లాప్‌ సినిమా, మామూలు ఫ్లాప్‌ కాదు, అట్టర్‌ ఫ్లాప్‌ సినిమా తీస్తే అప్పుడు ఆ దర్శకుడి కెరీర్‌ ఖతం అయినట్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి దర్శకులతో స్టార్‌ హీరోలు కాదు కదా, కనీసం యువ హీరోలు, కొత్త హీరోలు కూడా నటించేందుకు భయపడతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి శ్రీకాంత్‌ అడ్డాలకు ఉంది.

‘కొత్తబంగారు లోకం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్‌ అడ్డాల ఆ తర్వాత మహేష్‌బాబు, వెంకటేష్‌లతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీస్టారర్‌ను తెరకెక్కించాడు. ఆ సినిమా యావరేజ్‌గా ఉన్నప్పటికి శ్రీకాంత్‌ అడ్డాల ప్రయత్నంను అంతా కూడా అభినందించారు. ఇలాంటి మల్టీస్టారర్‌ చిత్రాలు ఎన్నో సంవత్సరాలుగా రావాలని ప్రేక్షకులు కోరుతున్నారని, మంచి ప్రయత్నం అంటూ శ్రీకాంత్‌ అడ్డాలపై ప్రశంసల జల్లు కురిపించింది. సీతమ్మ చిత్రాన్ని చక్కగా చేశాడనే ఉద్దేశ్యంతో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చేసేందుకు మహేష్‌బాబు ఓకే చెప్పాడు.