కాపు ఉద్యమకారుడి ఆంతర్యం ఏంటి ..? ఏ పార్టీకి ఆయన మద్దతు..?     2018-05-20   21:35:10  IST  Bhanu C

కాపుల్లో కుల చిచ్చు రగిల్చి అమాంతం పెద్ద కుల నాయకుడిగా ఎదిగిపోయిన ముద్రగడ పద్మనాభం రాబోయే రోజుల్లో ఏ పార్టీకి మద్దతు తెలపబోతున్నారు..? అసలు ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు..? అనే సందేహం ఇప్పుడు అన్ని రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. ఏపీలో బలమైన కాపు సామజిక వర్గాన్ని ఒక్కతాటిపై నడిపించి కుల ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న పద్మనాభం ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది.

ఆయ‌న వెనుక వైఎస్సార్‌సీపీ ఉంద‌ని, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చెప్పిన‌ట్లు పద్మనాభం ఆడుతున్నారంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మరొకవైపు ఆయన ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఎన్నికైన కాపు సామాజికవర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో భేటీ అవ్వడం తో అసలు పద్మనాభం అడుగులు ఎటువైపు అనేది సందేహంగా మారింది.

ఒకవైపు ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోంది. దానికోసం ఏపీలో బలమైన నాయకుల కోసం ఆ పార్టీ ఎదురుచూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కన్నాను కలవడంతో ముద్రగడ బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.