కమలం మారుతుందా ..? వాడుతోందా ..?     2018-06-02   01:46:57  IST  Bhanu C

కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ బీజేపీకి ప్రస్తుతం గడ్డుపరిస్థితులు నడుస్తున్నాయి. గతంలో ఆ పార్టీకే ఉన్న క్రేజ్ అమాంతం పాతాళానికి పడిపోయింది. నరేంద్ర మోడీ పాలన పైన నిర్వహించిన సర్వే లు కూడా ఇదే వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. పై పెచ్చు కర్ణాటకలో అధికారం చిక్కినట్టే చిక్కి చేజారిపోవడం, ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంపాలు అవ్వడం ఆ పార్టీ ఛరిష్మాని దెబ్బకొట్టింది. దీనికి తోడు ప్రాంతీయ పార్టీలతో సున్నం పెట్టుకోవడం.. అవన్నీ ఇప్పుడు కూటమిగా ఏర్పడి బీజేపీ అంతం చూడాలని పట్టుదలకు పోవడం బీజేపీ పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెడుతోంది.

ఒకప్పుడు సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన పార్టీ ఇప్పుడు అధికార దాహం తో పని చేస్తుంది అన్న భావన కూడా కమల విలాపానికి కారణమేమో అని భావిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేయాలన్న బిజెపి కల కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. మోడీ గ్రాఫ్ రాను రాను తగ్గిపోతుంది. చాలా శక్తివంతమైన నాయకుడిగా వున్న మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చెయ్యటం , ధరల పెరుగుదల, జీఎస్టీ మొదలయినవి బీజేపీ కొంపముంచుతున్నాయి.