ఒకే జిల్లాల్లో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వ‌రం     2018-05-13   05:29:30  IST  Bhanu C

ఏపీలో అధికార టీడీపీకి ఇటీవ‌ల వ‌రుస‌గా షాకులు మీద షాకులు త‌గులుతున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర రాజ‌ధాని జిల్లాల‌కు చేరుకోగానే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధికార పార్టీ నుంచి విప‌క్ష వైసీపీలోకి పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు కంటిన్యూ అయ్యాయి. టీడీపీలో కీల‌క నేత‌లుగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వి, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ లాంటి వాళ్లు వైసీపీలోకి జంప్ చేసేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర త‌ర్వాత ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి ఊపు వ‌చ్చింద‌న్న‌ది నిజం. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు రాజ‌ధాని ఏరియా నుంచి అధికార పార్టీకి చెందిన ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధిక్కార స్వ‌రం వినిపించ‌డంతో పాటు వాళ్లు చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తుంటే ఆ ఇద్ద‌రు పార్టీ మారుతున్నారా ? అన్న సందేహాలు అక్క‌డ రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు రావెల కిషోర్‌బాబు, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇద్ద‌రూ చేస్తోన్న వ్యాఖ్య‌లు ఇప్పుడు అధికార పార్టీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి చివ‌రి క్ష‌ణంలో సీటు ద‌క్కించుకున్న మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల కిషోర్‌బాబు ఆ వెంట‌నే సామాజిక‌వ‌ర్గ కోణంలో మంత్రి కూడా అయ్యారు. ఆ త‌ర్వాత రావెల తీరుతో పాటు ఆయ‌న దురుసుత‌నం, ఆయ‌న కుమారుల వ్య‌వ‌హారంతో పార్టీ ప‌రువు ఖాస్తా బ‌జారున ప‌డింది. చివ‌ర‌కు ఆయ‌న శాఖ‌లోనూ, ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న తీరుతోనూ విసిగిపోయిన చంద్ర‌బాబు ఆయ‌న్ను కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో త‌ప్పించారు.