ఏపీలో ఆ ఇద్ద‌రు లేడీ ఫైర్‌బ్రాండ్ల‌కు పొలిటిక‌ల్ క‌ష్టాలు     2018-05-21   00:09:31  IST  Bhanu C

చిత్తూరు జిల్లాలో ఇటు అధికార టీడీపీ, అటు ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి కీల‌క రోల్ పోషిస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఛాన్స్ క‌ష్ట‌మేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రు రాజకీయాల్లో లేడీ ఫైర్‌బ్రాండ్‌లుగా ఉన్న వాళ్లే. వీరిలో టీడీపీ మ‌హిళా మ‌ణి, మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌.. ఇప్ప‌టికే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే స్వ‌యంగా వెల్ల‌డించారు. దీంతో జిల్లాలో పెను కుదుపు ఏర్ప‌డింది. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గ‌ల్లా అరుణ.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిపై ఓడిపోయారు. అయితే. అప్ప‌ట్లో.. అంద‌రూ ప‌నిగ‌ట్టుకుని త‌న‌ను ఓడించార‌ని టీడీపీపై అప్ప‌ట్లోనే ఆమె విరుచుకుప‌డ్డారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం ఆమె సీనియార్టీని గుర్తించి చంద్ర‌గిరి టీడీపీ ఇంచార్జ్‌గా ఆమెనే నియ‌మించారు.

1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓట‌మి లేకుండా గెలుస్తూ వ‌స్తోన్న ఆమె కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆమె టీడీపీలోకి జంప్ చేసి చంద్ర‌గిరి బ‌రిలో నిలిచారు. ప్ర‌స్తుతం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమె మాట‌ను దిగువ‌శ్రేణి నాయ‌కులు ఖాత‌రు చేయ‌డం లేదు. దీనికితోడు అనారోగ్యంతో ఇంటి ప‌ట్టునే ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ అటుంచి త‌న‌ను పార్టీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని ఆమె చంద్ర‌బాబుకు విన్న‌వించారు.