ఎవ్వరూ తగ్గట్లేదు ... టీటీడీ లో వివాదాన్ని ఇలాగే వదిలేస్తారా ..?     2018-05-22   01:13:20  IST  Raghu V

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మసకబారుతోంది. మాజీ ప్రధాన అర్చకుడు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అంతే కాదు రాజకీయ రంగు పులుముకుని మరింత పెద్ద వివాదంగా మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. రమణ దీక్షితులు ఆరోపణలు దానికి టీటీడీ , కొంతమంది బ్రాహ్మణ సంఘాల కౌంటర్ లతో రోజురోజుకు ఈ వివాదం పెద్దదవుతుందే కానీ తగ్గడం లేదు.

అభివృద్థి పేరుతో పురాతన నిర్మాణాలను, ప్రాకారాలను పునాదులతో సహా పెకిలించి వేయడంతోపాటు స్వామి వారి ఆలయంలో తయారుచేయాల్సిన ప్రసాదాలను ఆగమశాస్త్రానికి విరుద్థంగా బయట తయారు చేసి ఆలయంలోకి తీసుకొస్తున్నారంటూ కొత్త విషయాలను బయటపెట్టారు. గర్భాలయం పక్కన ఉన్న పోటును 25 రోజులుగా ఎందుకు మూసేశారని ప్రశ్నిస్తున్నారు. వంటావార్పు, అర్చకులు తప్ప నైవేద్యానికి వినియోగించే ప్రసాదాలను ముందుగా వేరొకరు చూడకూడదని కానీ అలాంటి నిబంధనలు ఏవీ ఆలయంలో అమలు జరగడంలేదని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. అంతేనా .. శ్రీవారి గరుడ సేవలో వినియోగించే ఐదు వరుసల వజ్రాలు పొదిగిన ప్లాటినం హారంలో గులాబీ వజ్రం మాయమయ్యి విదేశాల్లో వేలంలో అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసారు.