ఎంపీగా ష‌ర్మిళ‌.. ఆ మూడు సీట్ల‌లో ఒక‌టి క‌న్ఫామ్‌!     2018-04-30   03:37:26  IST  Bhanu C

`జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని నేను` అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్ జైల్లో ఉన్న స‌మ‌యంలో ఓదార్పు యాత్ర చేసి పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపిన ష‌ర్మిళ‌.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఆమె పేరు పార్టీలో ఎక్క‌డా వినిపించ‌డం లేదు. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఇప్పుడు ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆసక్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావ‌డం కన్ఫామ్ అని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే ఎక్క‌డి నుంచి పోటీచేస్తార‌నే విష‌యంలో మాత్రం కొంత సందిగ్దంలో జ‌గ‌న్ ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రో ప‌క్క‌.. ఆమె ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగుతారా లేక కేవ‌లం పార్టీ ప్ర‌చారానికే ప‌రిమిత‌మవుతారా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి!!

ప్ర‌స్తుతం వైఎస్ కుటుంబం నుంచి ఇద్ద‌రు మాత్రమే బ‌రిలో ఉన్నారు. పులివెందుల నుంచి జ‌గ‌న్‌, క‌డ‌ప ఎంపీగా అవినాష్‌రెడ్డి పేర్లు మాత్ర‌మే ఉన్నాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరితో పాటు ఎవ‌రు పోటీచేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. జగన్‌తో పాటు ఆయ‌న సోద‌రి వైఎస్‌ షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. విశాఖ నియోజకవర్గంతో పాటు ఒంగోలు నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌నే చర్చ మొద‌లైంది. విశాఖ నియోజకవర్గంలో గెలిచి, గత చేదు అనుభవాన్ని తుడిచేయాలని జగన్‌ పట్టుదలతో ఉన్నాడనే మాట వినిపిస్తోంది. గ‌తంలో ఇక్క‌డ ఎంపీగా పోటీచేసిన జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌.. ఓడిపోయిన విష‌యం తెలిసిందే!