ఇప్పటికి తెలిసిందా ప్రాంతీయ పార్టీల 'పవర్'     2018-06-06   02:41:53  IST  Bhanu C

ఓడ ఎక్కేదాకా కూడా మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న ! అన్నట్టు ఇప్పటివరకు వ్యవహరించి కేంద్ర అధికార పార్టీ బీజేపీకి ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతున్నాయి. అధికార పొగరు నెత్తికి ఎక్కడంతో మిత్రపక్షాలన్నిటిని దూరం చేసుకున్న ఆ పార్టీకి వరుసగా అపజయాలు ఎదురు అవ్వడంతో ఇప్పుడు తేరుకుని అందరి దగ్గరకు కాళ్లబేరానికి వెళ్తోంది. మునుపటిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో బొక్కబోర్లా పడడం ఖాయం అని గ్రహించిన బీజేపీ పెద్ద తలకాయలు అమిత్ షా , నరేంద్ర మోదీలు దూరం అయిన మిత్రులందరిని దగ్గరకు చేర్చుకునే పనిలో పడ్డారు.

దేశం లో ఉన్న ప్రాంతీయ పార్టీలంటే చాలా చులకనగా చూస్తూ .. మీ అవసరం మాకేంటి అన్నట్టు ప్రవర్తిస్తూ కక్ష సాధింపుచర్యలకు దిగేవారు. దాదాపు ప్రతి మిత్రపక్షంతోనూ ఇదే విధంగా వ్యవహరించారు. ఫలితంగా.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల తరపున బీజేపీకి మద్దతుదారులు లేకుండా పోయారు. ఉన్న వారితో ఉపయోగం లేదు. ఎన్డీఏలో ఉన్నా.. బీజేపీని నమ్మే పార్టీలు లేవు. ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన పరిస్థితేమీ కాదు. గత మూడేళ్లగా ఉన్నదే. కాకపోతే ఇప్పుడే బీజేపీ అగ్రనేతలకు ఈ విషయం బాగా తెలిసొచ్చింది.