ఇంక‌.. బాబు-లోకేష్‌లు దొరుకుతారా? త‌మ్ముళ్ల ఆవేద‌న‌

తెలుగుదేశం పార్టీ అధినేత‌, మంత్రుల్లో జోష్ నింపిన నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు ఆ పార్టీ త‌మ్ముళ్ల‌లో తీవ్ర ఆవేద‌న మిగిల్చింద‌ని అంటున్నారు. ఇది గెల‌వ‌కుండా ఉండి ఉంటే ప‌రిస్థితి ఇంకో ర‌కంగా ఉండేద‌ని, త‌మ‌కు ప్రాధాన్యం పెరిగేద‌ని దిగువ‌స్థాయి నేత‌లు అనుకుంటున్న‌ట్టు వినికిడి. వాస్త‌వానికి నంద్యాల ఉప పోరుకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లు తమ అవసరం ఉన్నప్పుడు తప్ప.. మంత్రులు స‌హా పార్టీ సీనియ‌ర్ల‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలేదని, ఇక‌, కిందిస్థాయి నేత‌ల ప‌రిస్థితి దారుణంగా ఉండేద‌ని చెబుతున్నారు.

ఇక‌, ఇప్పుడు నంద్యాల‌లో గెల‌వ‌డం, పార్టీ ఊహించ‌ని మెజారిటీ సాధించ‌డం, అభ్య‌ర్థి సునాయాసంగా గెల‌వ‌డం వంటి ప‌రిణామాలు ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు, లోకేష్‌ల‌లో ఎంత‌లేద‌న్నా.. కొంచెం అహంకారం పెంచేలా చేస్తాయ‌ని అంటున్నారు. అదికూడా ఎవ‌రి స‌హ‌కారం లేకుండానే టీడీపీ నంద్యాల‌లో ప‌రిగెత్త‌డం కూడా బాబుకు కొంత గ‌ర్వంగానే ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో ఇక త‌మ‌ను అస‌లు ప‌ట్టించుకుంటారా? అనేది దిగువ‌స్థాయి త‌మ్ముళ్ల ఆవేద‌న‌. దీంతో తాము చెప్పినట్లే వినేవారిని తప్ప.. ఇతర పార్టీ నేతలను మరింత దూరం పెట్టే అవకాశం ఉందని ఓ సీనియర్ మంత్రి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.