ఇంకా ఏడాదే గడువు ! బాబు రెడీగా ఉన్నావా ..?     2018-06-08   01:53:59  IST  Bhanu C

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అన్ని పార్టీలకు ఇది ఎంతో కీలకమైన సమయం. రాబోయే ఎన్నికల్లో అధికార పీఠం దక్కించుకోవాలంటే .. ఈ సంవత్సరకాలం లో ప్రజల్లో విశ్వాసం కలిగించగలగాలి. ఇక అధికార పార్టీ తెలుగుదేశం విషయానికి వస్తే… అన్ని పార్టీలకంటే టీడీపీ మరింత కష్టపడాలి. సాధారణంగానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. వీటన్నిటిని తట్టుకుని ప్రజల్లో విశ్వాసం కల్పించగలగాలి. అప్పడే విజయావకాశాలు ఉంటాయి.

అధికారం చేపట్టి మూడు సంవత్సరాల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతుంది .. ఇక టీడీపీ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కొండంత బలాన్ని అందించాయి. ఈ రెండు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేశాయి. తెలుగుదేశం పార్టీకి ఎదురులేదనే వాతావరణాన్ని సృష్టించింది. ఆ తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకుని పోరాటయాత్ర చేస్తున్నారు. అంటే నాలుగేళ్లలో టీడీపీ మిత్రులను వదులుకుని ఒంటరిగా మిగిలిపోయింది.