అన్న‌తో పాటు త‌మ్ముడూ అసెంబ్లీకే పోటీనా... ఆగ‌మాఘ‌మేనా..     2018-05-22   04:02:49  IST  Bhanu C

తెలంగాణ రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ రూటే స‌ప‌రేటు. ఇక న‌ల్ల‌గొండ జిల్లాలోనైతే వారికిక తిరుగేలేదు. ఇద్ద‌రు సోద‌రులు ఏది మాట్లాడినా.. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం స‌`ష్టిస్తుంది. పార్టీ అధిష్ఠానాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపిపించ‌దు. పార్టీలో కీల‌కంగా ఉంటూనే త‌మ సొంత ఎజెండాతోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం వారికే సాధ్యం. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు..? పార్ల‌మెంటు స్థానాల్లో బ‌రిలోకి దిగుతారా..? లేక అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తారా..? అన్న‌దానిపై ఇప్పుడు న‌ల్ల‌గొండ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది.

అయితే పార్ల‌మెంటుకు వెళ్తార‌ని ఒక‌రంటే… లేదులేదు.. అసెంబ్లీకే వెళ్తారంటూ మ‌రొక‌రు.. ఇలా న‌లుగురు క‌లిసిన‌చోట ఇదే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ చేప‌డుతున్న ప్ర‌జాచైత‌న్య‌బ‌స్సుయాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది. అయితే ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించే స‌భా వేదిక‌ల‌పై ప‌లుచోట్ల‌ అభ్య‌ర్థుల‌ను టీపీసీ చీఫ్ ప్ర‌క‌టించ‌డంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా.. న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండానే.. ఈసారి మునుగోడు నియోజకవర్గ ప్రజల కోరిక‌ మేరకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్ర‌క‌టించారు.