అధినేత అయితే ఏంటి ..? టీడీపీలో పెరుగుతున్న అసమ్మతి నాయకులు    2018-06-04   02:04:55  IST  Bhanu C

క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ధిక్కార స్వరాలు పెరిగాయి. నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ క్రమశిక్షణ ఉల్లంగిస్తున్నారు. కొంతమంది పక్క పార్టీలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుని ఉన్న పార్టీని వీడేందుకు ధిక్కార స్వరాలు వినిపిస్తుండగా .. మరికొంతమంది తమకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదంటూ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఈన్నికలకు ఇంకా ఏడాది లోపే సమయం ఉండడంతో ఎవరిని గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి పార్టీలో ఉంది.

తెలుగుదేశంలో క్రమశిక్షణ ఎంత తప్పిందంటే.. సాక్ష్యాత్తు చంద్రబాబు పాల్గొంటున్న కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతూ అధినేతకు తలనొప్పిగా మారారు. వేర్లో కొంతమంది పార్టీ వీడనున్నారనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే కోవలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరడం ఖాయం అన్న వార్తలు మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నాయి. అదేవిధంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి కూడా బాబుతో కనీసం మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కర్నూలు జిల్లాలో జరిగిన మినీ మహానాడు, జిల్లా మహానాడుతో పాటు విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా స్వయంగా లోకేష్‌తో సహా ఇతర నాయకులు పిలిచినప్పటికీ రాలేదు. తాజాగా చంద్రబాబు కర్నూలు పర్యటనలో కూడా బీసీ జనార్థనరెడ్డి కనిపించలేదు. దీనిపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.